ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 8:15 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆదిలాబాద్, మామూనూరు (వ‌రంగ‌ల్‌) విమానాశ్ర‌యాల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాలి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

అర్జున్ సమాచారం:
తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వ‌రంగ‌ల్‌) విమానాశ్ర‌యాల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి  కె. రామ్మోహ‌న్ నాయుడు కి విజ్ఞప్తి చేశారు. మామూనురు విమానాశ్ర‌యానికి అవసరమైన భూ సేక‌ర‌ణ‌ను పూర్తి చేసి ఇచ్చామ‌ని తెలిపారు.
ఢిల్లీలోని పౌర విమాన‌యాన శాఖ కార్యాల‌యం రాజీవ్ గాంధీ భ‌వ‌న్‌లో కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో ముఖ్య‌మంత్రి  స‌మావేశ‌మ‌య్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజ‌ర్ టెర్మిన‌ల్‌, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవ‌ర్‌హాలింగ్‌) వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని కోరారు.
ఆదిలాబాద్‌లో రన్‌వే ఫైన‌లైజ్‌ చేయడానికి సంబంధించి ర‌క్ష‌ణ, పౌర విమానయాన శాఖ‌ల సంయుక్త స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రి  విజ్ఞప్తి చేశారు.

మామునూరు (వరంగల్) విమానాశ్రయం టెండ‌ర్ల‌ను రెండు వారాల్లో పిలిచి డిసెంబ‌ర్ నాటికి ఖ‌రారు చేసి ప‌నుల‌కు అదే నెల‌లో శంకుస్థాప‌న చేస్తామ‌ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు.
తెలంగాణ‌లో చాప‌ర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాల‌ని రామ్మోహ‌న్ నాయుడుకి ముఖ్య‌మంత్రి  విజ్ఞ‌ప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణ‌లో ప‌ర్యాట‌క రంగం మ‌రింత అభివృద్ధికి అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో సీ-ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదిక‌ను రెండు వారాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంద‌జేస్తామ‌ని ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్య‌మంత్రి కి తెలిపారు.
ఈ స‌మావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , సురేశ్ షెట్కార్‌ , రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ప్రొటోకాల్‌) హ‌ర్కార వేణుగోపాల రావు , రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు , సీఎం సెక్ర‌ట‌రీ మాణిక్ రాజ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
===============================